మూఢనమ్మకం వీడింది! గంట మొగించేది ఎవరు కథ | Pitta Kathalu in Telugu

By MyTeluguStories

Published On:

గంట మొగించేది ఎవరు కథ

Join WhatsApp

Join Now

మూఢనమ్మకం వీడింది! గంట మొగించేది ఎవరు కథ

ఒకానొక గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగలించి అడవిలోకి పారిపోయాడు. ఊళ్ళో వాళ్ళు వెంట పడ్డారు. పరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా? పట్టుబడి పోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి, తనూ దాక్కున్నాడు. దొంగ దొరకకపోతే ఊళ్ళో వాళ్ళు తిరిగి వెళ్లి పోయారు.

మళ్ళీ గంటతో పాట్లు ఎవరు పడతారు అనుకుని దొంగ కూడా గంటని అడవిలో వదిలేసాడు. కాల క్రమేణ ఈ సంఘటన అందరూ మర్చిపోయారు.

గంట మొగించేది ఎవరు కథ
గంట మొగించేది ఎవరు కథ

ఈ “గంట మొగించేది ఎవరు కథ” ఇక్కడి నుండే అసలు మలుపు తిరుగుతుంది. ఒక రోజు సాయంత్రం పూట హటాత్తుగా అడవిలోంచి గంట మోగడం మొదలట్టింది. ఆ గంట చప్పుడు గ్రామంలో స్పష్టంగా వినిపించింది. పక్షులు గూటికి చేరే ఆ సంధ్య వేళలో, అడవి నుండి వస్తున్న గంట శబ్దంతో గ్రామస్తులు అంతా భయపడ్డారు.

“గంట కొడుతున్నది ఎవరు?” అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. “ఆ దొంగ మళ్లీ వచ్చాడా?” అని కొందరంటే, “కాదు, ఇది దొంగ చేసే పనిలా లేదు, ఏదో దుష్టశక్తి పని” అని మరికొందరు అన్నారు.

రాత్రి కావడంతో ఎవరికీ అడవిలోకి వెళ్లి చూసే ధైర్యం చాల్లేదు. చివరికి, ఎవరికీ అసలు సమాధానము తోచక, అడవిలో ప్రేతాలు (దెయ్యాలు) ఉన్నాయని, అవే ఆ గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలయ్యింది. ఈ పుకారు ఊరంతా కార్చిచ్చులా వ్యాపించింది.

గ్రామంలో వాళ్ళు భయపడి అడవి వైపు వెళ్ళడం పూర్తిగా మానేశారు. సాయంత్రం ఆరు గంటలకే ఇళ్ల తలుపులు మూసుకోవడం మొదలుపెట్టారు.

కానీ ఇది గ్రామస్తులకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఆ రోజుల్లో జీవనాధారం కోసం అడవిపై ఆధారపడక తప్పదు. పొయ్యిలోకి కట్టలు కావాలన్న, వేట ఆడాలన్నా, చాపలు పట్టాలన్నా, చివరకు పక్క గ్రామాలకు వెళ్ళాలన్నా ఆ అడవిలోంచి వెళ్లక తప్పదు.

ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్లకపోతే గ్రామస్తుల జీవనం స్తంభించిపోతుంది. అది చాలా పెద్ద ఇబ్బంది. అయినా, ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు కదా అని, అందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపేవారు.

మాటి మాటికీ గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపొయింది. గంట మోగినప్పుడల్లా ఊళ్ళో వాళ్లకి చెప్పుకోలేని భయం. ఈ భయం తట్టుకోలేక, ఉపాధి కోల్పోయి, కొంత మంది గ్రామం వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. గ్రామం నెమ్మదిగా ఖాళీ అవ్వడం మొదలైంది.

గంట మొగించేది ఎవరు కథ: అవ్వ ధైర్యం

ఒక రోజు గంట చప్పుడు వినిపిస్తుంటే, ఊరి చివర గుడిసెలో ఉండే ఒక ముసలి అవ్వ, “ఛ! ఏమిటీ పిచ్చి! ఇన్ని సంవత్సరాలుగా లేని దెయ్యాలు, ప్రేతాలు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాయి? అసలు గంట ఎవరు కొడుతున్నారు? ప్రేతాలున్నాయంటే నేను నమ్మను!” అనుకుంది.

గంట మొగించేది ఎవరు కథ
గంట మొగించేది ఎవరు కథ

ఆమెకు ఊరి ప్రజల భయం, వారి అమాయకత్వం చూసి జాలి వేసింది. “ఈ భయాన్ని ఇలాగే వదిలేస్తే, ఊరంతా నాశనం అవుతుంది. నేనే స్వయంగా వెళ్లి చూస్తాను. ఏమైతే అది అవుతుంది,” అని ధైర్యంగా నిర్ణయించుకుంది.

మరునాడు ఉదయాన్నే ఆ అవ్వ, చేతిలో ఒక కర్ర పట్టుకుని అడవిలోకి వెళ్లింది. “గంట చప్పుడు ఎటు వైపు వస్తోందో పరిశీలించి అటువైపు వెతుకుతాను” అని బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక, మళ్లీ గాలికి గంట శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన దిక్కుగా ఆమె నడక సాగించింది.

కొంత సేపటికి, గాలికి ఊగుతున్న చెట్ల మధ్య, ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న ఆ గుడి గంటను చూసింది.

ఆ గంట ఒక చెట్టు మీద వేల్లాడుతోంది. ఆ చెట్టు మీద బోల్డన్ని కోతులు వున్నాయి. గాలి బలంగా వీచినప్పుడు ఆ గంట కొమ్మకు తగిలి మోగుతోంది. లేదా, ఆ చెట్టు మీద అటూ ఇటూ గెంతుతున్న కోతులు తగిలినా, ఆ గంట ఊగి కొట్టుకుంటోంది.

ఈ దృశ్యాన్ని చూసిన అవ్వకు నవ్వు ఆగలేదు. “అయ్యో! ఈ పిచ్చి కోతులు చేసే పనికి, ఊరంతా దెయ్యాలు అనుకుని భయపడుతున్నారా!” అని పడీ పడీ నవ్వడం మొదలెట్టింది.

అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది. వెళ్లి ఊరి పెద్దను కలిసి, “అయ్యా! అడవిలో దెయ్యాలూ లేవు, ప్రేతాలూ లేవు. ఆ గంట మోగిస్తుంది కోతులు. నాకు కొంత సహాయం చేస్తే, ఆ గంటను ఇప్పుడే తీసుకువస్తాను. మన ఊరి భయాన్ని పోగొడతాను,” అని చెప్పింది.

ఊరి పెద్ద ఆశ్చర్యపోయాడు. “నిజమేనా అవ్వా? పూజలు, యజ్ఞాలు అవసరం లేదా?” అని అడిగాడు.

“ఏమీ అవసరం లేదు. నాకు కొంత డబ్బు ఇప్పించండి, కొన్ని పళ్ళు, పల్లీలు కొని, నా కొడుకుని వెంటబెట్టుకుని వెళ్లి ఆ గంటను తెచ్చేస్తాను,” అంది అవ్వ.

ఊరి పెద్ద వెంటనే అవ్వకు కావలసిన డబ్బు ఇచ్చి పంపించాడు. అవ్వ తన పెద్ద కొడుకుని వెంట పెట్టుకుని, బజారులోకి వెళ్లి అరిటి పళ్ళు, మామిడి పళ్ళు, వేరుసెనగ పల్లీలు కొనుక్కుంది.

అవ్వ, తన కొడుకు, ఇద్దరు సామాను తీసుకుని అడవిలోకి వెళ్ళారు. ఊళ్ళో వాళ్ళు ఊపిరి బిగించుకుని అడివి అంచున భయంగా ఎదురు చూసారు.

అడవిలో అవ్వ కోతులకు పళ్ళు, పల్లీలు చూపించింది. అవి చూసిన కోతులన్నీ గంట ఉన్న చెట్టు దిగి వచ్చి, ఆ పళ్ళు తినడంలో మునిగిపోయాయి. అదే అదునుగా, అవ్వ కొడుకు చటుక్కున చెట్టు ఎక్కి, ఆ గంటను తీసుకుని దిగి పోయాడు.

గంట మొగించేది ఎవరు కథ – నీతి

అవ్వ, కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్లోకి వచ్చారు.

యేమవుతుందో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న గ్రామస్తులు, గంటను చూసి, నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్య పోయారు.

గంట మొగించేది ఎవరు కథ
గంట మొగించేది ఎవరు కథ

అవ్వ జరిగినదంతా చెప్పింది. ఊళ్లోవాళ్ళు ఆమె ధైర్య సాహసాలని, తెలివి తేటలని మెచ్చుకున్నారు. “అయ్యో! అనవసరంగా ఇంత కాలం మూఢ నమ్మకాలతో, అపోహలతో ఇబ్బంది పడ్డామే!” అని సిగ్గుపడ్డారు.

ఈ “గంట మొగించేది ఎవరు కథ” మనకు చెప్పే నీతి ఏమిటంటే: **కంటితో చూడనిదానిని, చెవితో విన్నంత మాత్రాన నమ్మకూడదు. మూఢనమ్మకాలు భయాన్ని సృష్టిస్తాయి. ధైర్యంగా ఆలోచిస్తే, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది.**

ఈ నీతి కథలోని కొన్ని పదాలు:

  • పుకారు (Rumor): ఆధారం లేని వార్త.
  • ప్రేతాలు (Ghosts): దెయ్యాలు.
  • జీవనాధారం (Livelihood): బ్రతకడానికి ఆధారం.
  • స్తంభించిపోవడం (To stall): ఆగిపోవడం.
  • బిక్కుబిక్కుమంటూ (With fear): భయంతో వణుకుతూ.
  • మూఢ నమ్మకం (Superstition): హేతుబద్ధత లేని నమ్మకం.
  • అపోహ (Misconception): తప్పుడు అభిప్రాయం.
  • ధైర్య సాహసాలు (Courage and bravery): భయం లేకపోవడం.

→ ఇంకొక హాస్య కథ: కాకరకాయ రుచి కథ

→ ఒక మంచి నీతి కథ: కోతి కుతూహలం కథ

→ తాజా వార్తలు మరియు మరిన్ని కథల కోసం Smashora.com సందర్శించండి.

cropped-Logo-1.png

MyTeluguStories Admin

Follow Our Website to read good telugu Stories.

Leave a Comment