అసలు నిజం తెలిసింది! ఎద్దు గర్వం కథ | Telugu Moral Story About Pride

By MyTeluguStories

Published On:

ఎద్దు గర్వం కథ

Join WhatsApp

Join Now

ఎద్దు గర్వం కథ

ఎద్దు గర్వం కథ ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. ఆ ఊరి ప్రజలకు భక్తి ఎక్కువ. ఆ ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది. ఇది గ్రామానికి అతి పెద్ద పండుగ. ఆ రోజు కోసం ప్రజలు నెలల తరబడి ఎదురుచూసేవారు. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని, పూజలు చేసి, ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి, ముగ్గులతో, తోరణాలతో, పువ్వులతో, చాలా అందంగా అలంకరించేవారు.

ఎద్దు గర్వం కథ
ఎద్దు గర్వం కథ

ఈ ఊరేగింపుకు ఒక ప్రత్యేకమైన ఎద్దు బండి కట్టేవారు. అది సామాన్యమైన బండి కాదు. దాన్ని కూడా దేవుడి వాహనంలాగే చూసేవారు. ఆ బండిని ముందురోజే శుభ్రంగా కడిగి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పూల దండలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు.

మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? అది ఊరికే గర్వపడలేదు. ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా, బలంగా, చూడముచ్చటగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. ఈ సంవత్సరం, “రాముడు” అనే ఓక ఎద్దును ఎంచుకున్నారు. రాముడు ఆ గ్రామంలోకెల్లా రాజసంగా ఉండే ఎద్దు. తెల్లగా, ఎత్తైన మూపురంతో, బలమైన కొమ్ములతో అది నడుస్తుంటే చూసేవారికి కన్నుల పండుగగా ఉండేది.

పండగ రోజు ఉదయాన్నే రాముడిని చెరువుకు తీసుకెళ్లి, చల్లని నీటితో స్నానం చేయించారు. దాని చర్మం నిగనిగలాడేలా శుభ్రం చేశారు. నుదుటిన పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, కొమ్ములకు రంగులు వేశారు. మెడలో రంగురంగుల గంటలు కట్టి, శరీరంపై పట్టు వస్త్రాలు కప్పారు. ఆహ! ఆ అలంకరణలో రాముడిని చూసినవారు “ఆహా! ఎంత చూడముచ్చటగా ఉంది!” అని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది. అలంకరించిన రాముడిని బండికి కట్టారు. గుడి ముందర వేలమంది ప్రజలు గుమిగూడారు. పూజారి వచ్చి, దేవుడి విగ్రహాన్ని బండిలో ఎంతో భక్తితో ఉంచి, హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు.

ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు భక్తితో దారికి ఇరువైపులా నిలబడి, చేతులు జోడించి, వంగి, నమస్కారాలు పెట్టారు. కొందరు పూలు చల్లారు, కొందరు కొబ్బరికాయలు కొట్టారు. బాజా బజంత్రీలు మోగుతున్నాయి. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమ పడ్డాడు.

“ఆహా! నా గొప్పతనం ఈ రోజు ఈ ప్రజలకు తెలిసింది. వీరంతా నన్నే చూస్తున్నారు, నాకే నమస్కరిస్తున్నారు. నేను ఎంత గొప్పవాడిని! ఈ ఊరిలో నాకంటే గొప్పవారు ఎవరూ లేరు,” అని రాముడు గర్వపడ్డాడు. రోజంతా చాలా గర్వంగా, పొగరుగా, కొమ్ములు పైకి పెట్టి, ఛాతీ బయిటికి పెట్టి ఠీవిగా నడిచాడు. తనలో తానె మురిసిపోయి, పొంగిపోయాడనుకోండి! ప్రజల భక్తిని చూసి, అదంతా తన కోసమే అని భ్రమపడ్డాడు.

ఇక సాయంత్రంతో మళ్ళి ఊరేగింపు గుడికి చేరింది. దేవుడు గుడికి తిరిగి వచ్చినందుకు ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఎదురు సన్నాహంతో, బాజా బజంత్రీలతో, గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకెళ్లారు.

దేవుడి విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది? అప్పటిదాకా మోగిన బాజాలు ఆగిపోయాయి. తన చుట్టూ ఉన్న జనం అంతా దేవుడి విగ్రహం వెంటే గుడిలోకి వెళ్లిపోయారు. రాముడి వైపు చూసేవారే లేరు. అందరు రాముడిని మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు.

బండి కట్టిన వ్యక్తి వచ్చి, రాముడిపైన వేసిన పట్టు వస్త్రాలు తీసేసి, మెడలోని గంటలను విప్పేశాడు. మళ్ళీ రాముడిని మామూలు తాడుతో కట్టి, ఎడ్ల పాక లో తీసుకుని వెళ్లి అక్కడ వదిలేశాడు. అక్కడ చీకటిగా, పేడ వాసనతో ఉంది. ఎవ్వరూ అతనికి దండాలు పెట్టలేదు, పూలు చల్లలేదు.

ఎద్దు గర్వం కథ
ఎద్దు గర్వం కథ

అప్పుడు రాముడికి తను చేసిన తప్పు అర్ధమయ్యింది. “అయ్యో! ఉదయం నుండి ప్రజలు నమస్కరించింది నాకు కాదు, నాపైన ఉన్న దేవుడి విగ్రహానికి. నేను కేవలం ఆ విగ్రహాన్ని మోసే ఒక వాహనాన్ని మాత్రమే. దేవుడు నాపై నుండి దిగిపోగానే, నా విలువ కూడా పోయింది. నా బలం, నా అందం చూసి కాదు, నేను చేస్తున్న పవిత్రమైన పనికి వారు గౌరవం ఇచ్చారు,” అని తన గర్వానికి సిగ్గుపడింది.

ఈ “ఎద్దు గర్వం కథ” నుండి నీతి

ఎద్దు గర్వం కథ మనకు చాలా ముఖ్యమైన నీతిని బోధిస్తుంది. మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం ఉన్న స్థానానికి లేదా మనం చేసే పనులకు. ఆ గౌరవాన్ని చూసి మనమే గొప్పవాళ్ళం అని గర్వపడకూడదు.

గర్వం మరియు అహంకారం

ఈ కథలో ఎద్దు గర్వానికి గురైంది. ప్రజలు తనను పూజిస్తున్నారని భ్రమపడింది. నిజ జీవితంలో కూడా, చాలా మంది ఉన్నత పదవులలో ఉన్నప్పుడు (అధికారులు, నాయకులు వంటివి) ప్రజలు ఇచ్చే గౌరవాన్ని చూసి, అది తమ వ్యక్తిత్వానికే వస్తుందని అహంకరిస్తారు. కానీ ఆ పదవి పోయిన వెంటనే, ఆ గౌరవం కూడా పోతుంది. ఈ ఎద్దు గర్వం కథ మనకు ఆ నిజయాన్ని గుర్తుచేస్తుంది.

స్థానం యొక్క విలువ

రాముడు బండి లాగినంత సేపు దానికి గౌరవం దక్కింది. ఎందుకంటే అది దేవుడిని మోస్తోంది. ఆ స్థానం చాలా పవిత్రమైనది. ఆ స్థానంలో ఏ ఎద్దు ఉన్నా అదే గౌరవం దక్కుతుంది. మనం కూడా మన జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు, ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలి కానీ, ఆ గౌరవాన్ని మన స్వంతం అని భావించి గర్వపడకూడదు. ఈ ఎద్దు గర్వం కథ మనకు వినయం యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది.

వినయం ఎప్పటికీ నిలుస్తుంది

పదవి, అందం, బలం శాశ్వతం కావు. కానీ వినయం, మంచి ప్రవర్తన ఎప్పటికీ మనతో ఉంటాయి. ఎద్దు తన నిజస్థితిని తెలుసుకున్నప్పుడు గర్వం పోయింది. మనం కూడా మనకు లభించిన గౌరవానికి కృతజ్ఞతతో ఉండాలి కానీ, అహంకారంతో విర్రవీగకూడదు.

సంబంధిత కథలు మరియు వనరులు


→ ఇలాంటి మరో స్వార్ధానికి సంబందించిన కథ: బాటసారుల అదృష్టం కథ


→ మా అన్ని కథల కోసం: ముఖ్య పేజీకి వెళ్లండి


→ ఈ కథ గర్వం (Pride) యొక్క పరిణామాలను వివరిస్తుంది.


→ ఇది వినయం (Humility) యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.


విగ్రహారాధన (Idolatry) సాంప్రదాయాల గురించి తెలుసుకోండి.

cropped-Logo-1.png

MyTeluguStories Admin

Follow Our Website to read good telugu Stories.

Leave a Comment